Monday, April 15, 2013

మహి

http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=6715&Categoryid=1&subcatid=3

చైత్రాగమనంతోనే మహి మొల కలెత్తుతుంది. చిగురుస్తుంది. మొగ్గ తొడుగుతుంది - పూలు పూస్తుంది. ఈ రాగబంధాన్ని రచయిత్రి కుప్పిలి పద్మ రమణీయంగా చిత్రించారు. ‘మహి’ నవల రూపంలో మన చేతికం దించారు. లోగడ ఒక వారపత్రికలో సీరియల్‌గా ప్రచురితమై పాఠకాదరణ పొందిన ఈ నవల, పాశ్చాత్య సంస్కృతికి ప్రభావితమైన మధ్యతరగతి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. జీవన మధురిమను రుచి చూపుతుంది. ఏలె లక్ష్మణ్ ముఖచిత్రం మనోహరంగా వుండి చదువరులను ఆకర్షిస్తుంది.

సరైన తోడు దొరకనప్పుడు ఒక్కోసారి ఒంటరి ప్రయాణమే హాయిగా ఉంటుంది. మహి కూడా అలాగే జీవిస్తుంటుంది. అలజడితో చలించక అంతర్వాహినిలా నిశ్శబ్దంగా సాగిపోతుంది. సమస్తం సమదృష్టితో వీక్షిస్తూ, కుటుంబాన్ని వెలిగించాలని తాపత్రయ పడుతుంది. అయితే ఆమె ప్రయత్నానికి పర్యవసానాన్ని మార్చేశక్తి లేదు. వైదేహి, ప్రకాశరావు దంపతుల ఆరుగురి సంతానంలో ‘మహి’ చివరి అమ్మాయి. హైదరాబాద్‌లో లెక్చరర్‌గా ఉద్యోగం. అక్కడే అక్క మాధవి కుటుంబమూ.

తల్లి తమ దగ్గరికి వస్తూ, పోతూ వుంటుంది. మాధవి ముద్దుల కూతురు నందన. వైదేహికి మరీ గారం. నందన రిచ్‌గా బతకాలని బోలెడు కలలు కంటుంది. బోర్‌లైఫ్ అస్సలు భరించలేదు. అమాంతం ఎగిరి ఆకాశాన్ని అందుకోవాలని ఆరాట పడుతుంది. అరిచి గీపెట్టి మరీ అడిగినవన్నీ సాధించుకుంటుంది. ‘‘పబ్‌కి వెళ్ళు. చక్కగా ఎంజాయ్ చెయ్. అయితే తాగొద్దు. నేను, డాడీ కలిసి తాగేటప్పుడు టేస్ట్ చేద్దువుగాని’’అని కూతురు బాయ్‌ఫ్రెండ్‌తో తిరగడానికి అనుమతిస్తుంది తల్లి మాధవి. ఆ ఇంటి వాతావరణంలో ఇలాంటి ఇంపైన అవగాహన కనిపిస్తుంది.

అక్కడ విశాఖలో మహి పెద్దన్నయ్య రామచంద్రరావు, వదిన విజయది మరో కథ. మృదువైన మాటలతో పెద్ద కొడుకుని అదుపాజ్ఞలలో పెట్టుకున్న తల్లి వైదేహి, కోడలిని ఒంటరిని చేస్తుంది. బతుకుతీపి కరువై నిర్లిప్తంగా సాగిపోతున్న ఆమె జీవితంలోకి ఆకస్మికంగా ఓ అందమైన స్నేహం ప్రవేశిస్తుంది. మహి సహాయంతో ఆ కొత్త స్నేహితుడు రవితో మొదలైన ప్రణయ విహారం, క్రమంగా శారీరక సంబంధంగా బలపడుతుంది. తమ ఇంటి పరువు కాపాడుకోవాలనే ఒకేఒక్క తపనతో విజయను కట్టడి చేయడానికి వైదేహీ ఎన్నో ఎత్తులు వేస్తుంది. ఆఖరుకు ఆ సంకెళ్ళు తెంచుకుని విజయ వెళ్ళిపోతుంది. ఆమె పిల్లలు మహి గూటికి చేరతారు.

మహి స్వేచ్ఛా వర్తన ఆమె కుటుంబ సభ్యులకు కంటగింపు కలిగిస్తుంది. అందుకని ఆమెతో అంత ఆత్మీయంగా మెలగరు. అయితే అవసరం వల్లనో, మరో కారణం చేతనో మాట్లాడక తప్పదు. అలాగని వీరి మధ్య ప్రేమాభిమానాలు లేవనీ చెప్పలేం. వారి ఈ అయిష్టతకు, మహి జీవితంలో కల్లోలానికి సాగర్, సిద్ధార్థ, చైతన్య కారణమౌతారు. ఒక్కొకరితో ఒక్కో రకమైన పరిచయం. ఆఖరుకు అభిప్రా యాలు, అభిరుచులు కలిసిన చైత్రతో జీవితం కొనసాగించుకోవాలని మహి నిర్ణయించుకోవడంతో కథ ముగుస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఇంత విసుగు, కోపం, నిర్లక్ష్యం, నిందలు, చులకన, ఎగతాళి, చీదరింపులు, వంకర నవ్వులు, సూటీమాటలు, ఎత్తిపొడుపులు వినాల్సి రావడం నిజంగా బాధా కరం. ఆ వైనాన్ని చిత్రించడంలో రచయిత్రి కృతకృత్యులయ్యారు.

మనల్ని వెంటాడి వేధించే వాక్యాలు ఈ నవల్లో అడుగడుగునా తారాజువ్వల్లా తారసపడతాయి. అయితే ఇందులో ఇతివృత్తం కొత్తదేమీ కాదు. ఓ కుటుంబం, అందులో సరాగాలూ-విరాగాలూ, అంతే! కాకపోతే విభిన్న వ్యక్తిత్వాల్లోని నిగూఢతను లోతుగా స్పర్శించడం వల్ల వాస్తవిక చిత్రణగా స్ఫురిస్తుంది. కుటుంబంలోని వ్యక్తుల ఆలోచనా ధోరణులకు తార్కికత జోడించి చెప్పడం వలన రచన మెరుపు సంతరించుకుంది. అలాగే భిన్న జీవనశెలులను ప్రజెంట్ చేయడంలో రచయిత్రి నేర్పు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘మహి’లో నేర్పు, కూర్పు కనిపించినంతగా సృజన కానరాక పోవడం ఓ చేదునిజం!
- కోటేశ్వరరావు
(‘మహి’ - కుప్పిలి పద్మ, పేజీలు: 297,
వెల: రూ. 120, ప్రతులకు: 201, విజయలక్ష్మి అపార్ట్‌మెంట్స్, మెథడిస్ట్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్-16)
- See more at: http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=6715&Categoryid=1&subcatid=3#sthash.wT48WMIs.dpuf

0 comments:

Post a Comment