Thursday, June 20, 2013

అగ్నికణం

అగ్నికణం : ఈ నవల తెలంగాణ గ్రామాలలో నెలకొన్న సామాజిక పరిస్థితులకు వాస్తవ చిత్రీకరణ. భూస్వాములు వారి తాబేదార్లు స్త్రీలపై లైంగిక దౌర్జన్యాలు చేయ డం, లొంగని స్త్రీల పట్ల అభియోగాలు మోపి హింసించడం నిత్యకృత్యాలుగా మారి నికృష్టచేష్టలుగానే మిగిలిపోయినవి.

అగ్నికణం నవలలోని ప్రధాన పాత్రలు : బయ్యక్క (బిక్కు), పికిలి నర్సయ్య (బయ్యక్క అన్న), మెగిలయ్య, గౌరయ్య, నర్సయ్య(పెద్ద మనిషి)పాపరాజు, రాజా రాం, కోమటి, కోమటి కొడుకు.
బయ్యక్క పుట్టింది మహారాష్ట్రలో. ఆమె చిన్నతనం పత్తితోటల్ల తండ్రితో పాటు కులాసాగానే సాగింది. తండ్రి మరణంతో తెలంగాణలోని మారుమూల గ్రామం చేరుకున్నది. తల్లి కూలి పనిచేసేది. ఆమె అన్న నర్సయ్య ఎడ్డోడు. ఊరవతల చిన్న గుడిసె, ఆ గుడిసెలో నివాసం. బిక్కుకు యుక్త వయసు వచ్చేసరికి ఆమె లైంగిక దౌర్జన్యాలకు గురైంది. ఆమె శరీరాన్ని ఊళ్లె చాలామంది వాడుకున్నరు. తండ్రి నుంచి కొడుకు వరకు ప్రతి అడ్డమైన వాడూ వాడుకున్నడు. మొండయ్య, గౌరయ్య, పాపరాజు కోమటివాని కొడుకు, కోమటి ఇలా ప్రతివాడు ఆమె పట్ల లైంగికంగానే అనుభవించాలనే ప్రయత్నం తప్ప మరోటి లేదు.
బిక్కుకు పికిలి ఆత్మీయుడు. వాడితో అనేక విషయాలు చెప్పుకునేది. తనను సమాజం పతితగా మార్చిందని ఆవేదనపడేది. ప్రతివాడికి తన శరీరం కావాలి.

తన శరీరంలోని బెత్తెడు జాగ కొరకు మాత్రమే పరితపించారని, దాని కొరకు అనేక బాసలు చేసేవారని చెప్పుకొని దుఃఖపడ్డది. బిక్కు జీవి త ప్రభావం అన్న నర్సనిపై పడింది. వానికి పిల్లనిచ్చేవారే లేరు. వాడు ఎంతగానో కుమిలిపోయి, చివరికి ఎటో ఎళ్లిపోయిండు. వాడి అడ్రస్ లేదు. బిక్కు మారాలనుకున్నది. కానీ సమాజం మారనివ్వలేదు. బిక్కు కనా కష్టం చేసింది. పనికి పోయింది. తట్టమోసింది. రాళ్లెత్తింది. పాడు జీవితం నుంచి మారాలని ప్రయత్నించింది. సమా జం మారనివ్వలేదు. బిక్కుకు ఏకైక దికై్కన తల్లి ముసల్ది మరణించింది. బిక్కు ఒంటరిదైంది. ప్రతి మగవాడు బిక్కును తినెయ్యాలనే చూపులే తప్ప మరోటి కాదు. కోమటి కొడుకు బిక్కును ఆశించాడు. వాని దండ్రి ఆశించాడు. మొండయ్య, గౌరయ్యలు పీక్కుతిన్నారు. పాపరాజు కన్నేసి కోర్కె తీర్చమన్నాడు. బిక్కు కాదంది.

వారు కాలనాగై పడగపూత్తారు.వేధించారు. ఒంటరిని చేశారు. చివరికి తండ్రిలాంటి నర్సయ్యతో అక్రమ సంబంధం అంటగట్టి చితకబాది ఊరునుంచి తరిమేశారు. బిక్కుకు ఆత్మీయమైన ముద్దుబిడ్డ పికిలి దూరమయ్యాడు. బయ్యక్క కడుపుతోనుంది. దానికి తండ్రెవడు? మొండయ్యనే. కానీ వాడొప్పుకోలేదు. కడుపుతోనున్న బిక్కు పట్నం చేరింది. అరిగోస పడ్డది. అక్కడ గవే చూపులు. ఆ బెత్తెడు జాగ కొరకే తపన. మనిషన్న వాడులేని మానవత్వం దహించుకుపోయిన సమాజమిది. గుడిసెలున్న చోటుకు వచ్చింది. రాజారాం అనే విప్లవకారునితో శరణు వేడుకుంది. కాముక సమాజమును అర్థం చేసుకున్న అతడు బిక్కుకు ఆశ్రయం కల్పించాడు. చదువు నేర్పించాడు. సంస్కారం నేర్పించాడు. విప్లవ భావాలను అర్థం చేసుకున్న బికిలి సమాజ స్వరూపాన్ని అర్థం చేసుకున్నది. తనను అవమానించి, తనను నాశనం చేసిన గ్రామాన్ని సంస్కరించే దిశలో ఆలోచించే గొప్ప మార్పును నవల ముగింపులో అల్లం రాజయ్య చూపెట్టా డు.

అగ్గి రాజుకున్నాక అది ఆరిపోదు. జ్వాలవలె రగులుతుంది. దౌర్జన్యం ఉన్నచోట తిరుగుబాటు ఉంటుంది. అదే సంఘ సంస్కరణకు దారి తీస్తుంది. వెలుగు దారి అవుతుంది. అల్లం రాజయ్య నవలల్లో కొలిమంటుకున్నది, ఊరు,అగ్నికణం నవలల్లో అమానవీయ సమాజంలో మార్పును తీసుకురావాలనే ప్రయత్నం కన్పిస్తుం ది. తెలంగాణ పల్లెల్లో రాజుకున్న విప్లవ భావాలు చైతన్య శిఖరాలై దోపిడీ దారులను తరిమేసిన పరిస్థితులు కన్పిస్తాయి. సింగరేణి బొగ్గు గనులు, అనేక ఉద్యమాలు, కార్మికలోకపు ఐకమత్యం మనకు కనిపిస్తాయి. విప్లవ భావం వీరత్వానికి ప్రతీకగా నిల్చిన స్థితుల్ని సామాన్యుని భాషలోనే చిత్రించి సజీవతకు జీవం పోశారు అల్లం రాజయ్య. 



Copyright:డాక్టర్ సందినేని రవీందర్

0 comments:

Post a Comment