Wednesday, July 24, 2013

అరుణ...చలం..ఓ ‘లీల :Courtesy:http://archives.andhrabhoomi.net/sahiti/chalam-010

అరుణ...చలం..ఓ ‘లీల’

చలమిజం -9

చలం 1938లో ‘అరుణ’ నవల్ని రాశాడు. 1937లో అరుణాచల దర్శనం తర్వాత చలం రాసిన నవల ఇది. అప్పటినుంచే చలంపై రమణమహర్షి ప్రభావం కనిపిస్తూ ఉండేది. 1937లోనే తనలోని కాముకుడు, కథకుడు చలం చచ్చిపోతున్నాడని స్వయంగా చెప్పుకున్నాడు. అయితే ఆ తర్వాత సంవత్సరంలో రచించిన ‘అరుణ’లో మాత్రం కాముకుడు చచ్చిపోయిన దాఖలా ఏమీ కనిపించలేదు. అయితే కథకుడిగా చలం అంతకుముందు దాకా చేసిన రచనలకు ఈ ‘అరుణ’ రచనకు మాత్రం స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. అప్పటిదాకా సూటిగా కథ చెప్పి పాఠకుడ్ని ఇట్టే ఆకట్టుకునే చలం ‘అరుణ’లో మాత్రం కొరకరాని కొయ్యలా కనిపిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే అరుణలో కొత్త టెక్నిక్‌ని ప్రవేశపెట్టాడు. నవల ప్రారంభ దృశ్యంనుంచి పాఠకుడికి ఏమీ అర్ధంకాక తికమక పడతాడు. క్రమక్రమంగా వివిధ పాత్రల ప్రవేశంతో కథలో ఆసక్తి మొదలవుతుంది. రచయితగా చలం ఈ నవల్లో ప్రధానపాత్ర పోషిస్తాడు. రచయిత ఇంటినే రంగస్థలిగా మార్చి కథ నడిపిస్తాడు. ఎక్కువగా ప్రతీకాత్మక (సింబాలిక్) ధోరణితో ఈ నవల నడుస్తుంది. పాఠకుడు ఓపిగ్గా మనసు పెట్టనిదే ఈ నవల అర్ధంకాదు. ‘మైదానం’ నవల పంచదార చిలక అయితే ‘అరుణ’ పాషాణ పాకం.
చలం జీవితాంతం ఎదురుచూసిన ఆదర్శస్ర్తి, దివ్యమూర్తిగా ‘అరుణ’ కనిపిస్తుంది. అయితే చలం తనదైన ‘లైంగిక స్వేచ్ఛా’ మార్గం మాత్రం ‘మిస్’ కాకుండా జాగ్రత్తపడ్డాడు. ఒకవైపు అరుణను లోకోత్తర దివ్యస్ర్తిగా చెబుతునే మరోవైపు తాను కోరుకున్న వారితో స్వేచ్ఛగా సంచరించేలా అరుణను చిత్రీకరించాడు. ఒక్కోసారి ‘్భగవాన్’ స్ఫురణకువచ్చేలా ‘అరుణ’ పాత్రకు దివ్యత్వాన్ని కూడా ఆపాదించే ప్రయత్నం చేశాడు.
మునసబు జయరావు భార్య అరుణ. సంపదలకు అధికారానికి లోటులేదు. కానీ భర్తపై అసంతృప్తితో బీస్ట్, నాగన్ అనేవారితో సంబంధం పెట్టుకుంటుంది. మరోవైపు రచయిత (చలం) కూడా అరుణను కోరుకుంటూ ఉంటాడు. ఒక సస్పెన్స్ సినిమాలోని సీన్‌లా అరుణ నవల్ని మొదలుపెడతాడు చలం. రచయిత (చలం) రాత్రిపూట చదువుకుంటూ ఉండగా అతని గదిలోకి ప్రవేశిస్తుంది అరుణ. తలుపు గడియవేసి ఇల్లు భద్రం చేసి వచ్చాను కదా! ఈమె లోపలికి ఎలా వచ్చింది చచ్చిపోయి అంటూ ఉత్సుకతను రేపుతాడు. అయితే తలుపులు మూసి గడియవెయ్యడం మరిచిపోతాడు రచయిత. చలం నమ్మిన స్ర్తి స్వేచ్ఛకు అరుణను ప్రతీకలా చిత్రించే ప్రయత్నం చేశాడు చలం. అరుణను అతీంద్రీయ శక్తిగా, శక్తి స్వరూపిణిగా మలిచాడు.
అరుణతో రచయిత సంభాషణలు పరస్పరం మమేకమయ్యే భావపరంపరతో రాత్రంతా గడిచిపోతుంది. తెల్లారేసరికల్లా అరుణ ప్రియులిద్దరూ రచయిత ఇంటికొస్తారు. అరుణ పొందుకోసం తహతహలాడతారు. అడవి జంతువుల్లా పోట్లాడుకుంటారు. కాట్లాడుకుంటారు. ఎవరికి వారే అరుణను పొందాలనుకుంటారు. కానీ ఆమె మాత్రం ఎవరికీ లొంగదు. వారందర్నీ ప్రేమగానే చూస్తుంది. ఈలోగా భర్త జయరావు అతని తల్లి, పంగనామాల ఆచార్యులు ఆమెను వెదుక్కుంటు అక్కడకి వస్తారు. భర్త రావడంతో ప్రియులిద్దరు పక్కకు జరుగుతారు. ఇల్లు వదిలి వచ్చినందుకు భర్త అరుణను మందలిస్తాడు. తనతో తిరిగి వచ్చేయమంటాడు. విధిలేక అరుణ అంగీకరించి భర్త వెంట బయలుదేరుతుంది. అయితే రైలు తప్పిపోవడంతో వారంతా ఆ రాత్రి తిరిగి రచయిత ఇంటికి వచ్చేస్తారు. తెల్లారేసరికి అరుణ కనిపించదు. మరి ఏమైంది? భర్తతో తిరిగి వెళ్లడం ఇష్టం లేక మరణించిందా? లేక మరేమైంది? అన్న సందిగ్ధతతో కథ ముగిస్తాడు రచయిత. అయితే చివరలో ‘అరుణ’ చచ్చిపోలేదన్న భ్రమ కల్పిస్తాడు. ‘‘నాకు తెలుసు. మబ్బుల్లో చిన్న బిడ్డల లేత మడమల మీద కందిన ప్రియురాలి మెడమీద రోజాపువ్వుల రేకుల్లో, పద్మాల నడుమ, తాగిన మా కళ్ల కొలకుల ఎరుపు జీరల్లో నశించలేదని రచయిత చెబుతాడు. (అరుణ పే-) ఈ నవల రాయడానికి ముందు సంవత్సరం (1937) చలం ఇలా చెప్పుకున్నాడు. ‘‘ఏళ్లనుంచీ పేరుకున్న కిలుము క్రమంగా తోమేస్తున్నారాయన (్భగవాన్ రమణమహర్షి) ఈ పాత హృదయంమీద అక్కడక్కడా వెలుగు రేఖలు పడుతున్నాయి’’. అయితే అరుణ నవల్ని పరిశీలిస్తే చలంలో ఏళ్లనుంచి పేరుకుపోయిన (శృంగార) కిలుముపోయిన దాఖలాలేమీలేవుగానీ అక్కడక్కడ వెలుగురేఖలు (ఆధ్యాత్మిక వాసనలు) మాత్రం కనిపిస్తాయి.
‘తీవ్రమైన వాంఛ నాకళ్లకి పొరలు కప్పకపోవడంచేత, ఆమె (అరుణ) అందాల్ని చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాను. ఈ మాయ ప్రపంచంలో ఇంకా చిక్కని మాయ ఈ ప్రేమ మాయ స్ర్తి వాంఛ! ఆ మోహమే ముక్కుపట్టుకుని తాను వలచింది రంభ చేస్తుందంటాడు చలం (అరుణ పే.9) అందగత్తె ఎదురుగా ఉన్నా మోహం లేకపోవడంతో రాత్రి బాధిస్తుందంటూ రచయిత ఆవేదన చెందడం చూస్తే అప్పటికి చలంలోని ‘వేడి’ కాస్తంత చల్లబడిందనుకోవాలి. ఆమె (అరుణ) నా కళ్లని పెదిమలతో తెరుస్తోంది. ఆమె వేళ్లు వెనె్నముకకి చక్కలిగింతలు పెడుతున్నాయి. ఇంత రసికులు గనకనే ఆమెనుంచి చిరునవ్వు పొందిన పురుష నిర్భాగ్యులందరూ ఊర్వసి దర్శనం పొంది పోగొట్టుకున్నట్టు అన్ని సుఖాలు వదలుకుని ఆమెకోసం వెతుక్కుంటూ తిరుగుతారు’’ అంటూ అరుణని పరిచయం చేస్తాడు రచయిత (అరుణ పే-24)
అంతేకాదు ‘‘అరుణ సహాయ నిరాకరణోద్యమంలో పనిచేసింది. జైలుకు మాత్రం వెళ్లలేదు. తెలివిగా తప్పించుకుంది అంటారు గిట్టని వాళ్లు. అంతేకాక ఇంట్లోంచి తప్పించుకుని స్వేచ్ఛగా తిరగడానికి మంచి వంక దొరికింది అంటుంది పాడులోకం! కానీ అదంతా స్వేచ్ఛా సమరమేకదా! స్వేచ్ఛని వాంఛించిందని తప్పుపట్టడమెందుకు? అని ఆశ్చర్యపడతా’’నంటూ రచయిత మళ్లీ తన సిద్ధాంతానికి వచ్చేస్తాడు. ‘అరుణ’ రచనాకాలం నాటి చలానికి, అంతకు ముందు చలానికి కొంతలో కొంత భేదం కనిపిస్తుంది. ఎదురుగా రంభను తలదనే్న సౌందర్య రాసి ఉన్నా రచయిత (చలం) స్వభావ సిద్ధంగా ఉద్రేక పడడం, అమాంతంగా ఆమెను సొంతంచే సుకోవడం వంటి చేష్టలకు కాస్తంత దూరంగానే ఉంటాడు.
‘‘స్వేచ్ఛ స్వేచ్ఛ అంటాంగానీ, మనల్ని బంధించి నిలబెట్టే ఈ దేశం, సంఘం, కట్టుబాట్లు, మర్యాదలు, ఈ నాచురల్‌లాస్, ఫిజికల్ లాస్, సోషల్ లాస్, మన స్వేచ్ఛా వాదాలు, ప్రణయాలూ-శరీరం సరిగా పనిచేస్తున్నంతసేపే, అసత్యాలు శరీరపునిబంధనలకి యెదురు తిరగడాలు, గంతులూ’’ (అరుణ పే-78) అంటాడు. దీన్నిబట్టి చలంలోని కామం పొంగు తగ్గుముఖం పట్టిందనిపిస్తుంది. చలం ఓ సందర్భంలో అంటాడు ‘కామం నా రక్తంలో పుట్టిందని..’అరుణ’లో కూడా ‘దాని గుణం దాని రక్తంలోనే ఉందిలెద్దూ’ అని అరుణని ఉద్దేశించి ఆమె అత్త అంటుంది. అరుణ పాత్రని తన జీవితానికి, వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా మలుచుకున్నాడు చలం.
‘‘ఆమె పుణ్యరాశి-ఈ లోకంలో మధుర పుష్పాలూ అందాలూ అన్నీ కలిసి’’ అరుణ సృష్టింపబడిందంటాడు చలం. అంతేకాదు అరుణ ఒక్కర్నే ప్రేమించి, వారినే నమ్మి ఉండే మనిషి కాదు. పురుషులు ఆమెకి ఆటవస్తువులు, ఆమె తృప్తికి ఉపకరణాలు’’ అనిపిస్తాడు రచయిత. నిజానికి ఇది చలానికే వర్తిస్తుంది. స్ర్తిలు ఆయనకు ఆటవస్తువులు, ఆయన తృప్తికి ఉపకరణాలు. అరుణ కనబడకుండా పోయాక మళ్లీ ఎప్పటికీ కనిపించలేదు. ప్రతి సంవత్సరము రచయిత, బీస్ట్, నాగన్ ఇంకా నలుగురూ ఆ రోజు సాయంత్రమే కలుసుకుని షాంపెయిన్‌లో అరుణ రసికత్వాన్ని తలుచుకుంటూ రాత్రి గడుపుతారు. రచయిత మాత్రం అరుణ చచ్చిపోలేదు. ఇంకా బతికుందన్న నమ్మకంతో ఉంటాడు.
‘‘జీవితంలో ఈ దేహానికి నా శృంగార భావాలకి ఎట్లా స్వర్గ ద్వారాలు తెరిచిందో, అట్లానే నా ఆత్మకీ, నీ ఆధ్యాత్మిక సందేహాలకీ ఎప్పుడో, ఏ ఆశ్రమంనుంచో, స్వర్గ ద్వారాలు తెరుస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు రచయిత (చలం). అరుణ ఎప్పటికైనా తిరిగి వస్తుంది. అలా వచ్చి ‘‘నువ్వే ఉదయాచలం. నేను అరుణ కిరణాన్ని నిన్ను చుంబిత చలాన్ని చేస్తాను’’ అని అరుణ అంటుందేమోనన్న ఆశ చలానిది. అలా ఆశగా చూస్తున్న చలం జీవితంలోకి ‘లీల‘ ప్రవేశించింది. (1942) చలం ‘అరుణ’లో దర్శించిన స్ర్తి రూపాన్ని లీలలో చూశాడు. తన 48వ ఏట ‘లీల’ ప్రవేశం చలంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
తను ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ఆదర్శస్ర్తి (అరుణలాంటి) ఈ లీలే అంటూ చలం భావిస్తాడు. ఏడేళ్లపాటు లీలతో సహజీవనం చలంలో అనూహ్య మార్పులకు దోహదం చేసింది. ‘లీల’ వదిలి వెళ్లిపోయాక చలం జీవితం ‘శూన్య’మైంది. దాన్ని పూడ్చుకోటానికి చలం అరుణాచలంకు చేరుకుంటాడు..అలా ‘అరుణ’...‘లీల’ రూపంలో చలాన్ని రమణాశ్రమానికి చేరువ చేసింది.