Wednesday, July 24, 2013

అరుణ...చలం..ఓ ‘లీల :Courtesy:http://archives.andhrabhoomi.net/sahiti/chalam-010

అరుణ...చలం..ఓ ‘లీల’

చలమిజం -9

చలం 1938లో ‘అరుణ’ నవల్ని రాశాడు. 1937లో అరుణాచల దర్శనం తర్వాత చలం రాసిన నవల ఇది. అప్పటినుంచే చలంపై రమణమహర్షి ప్రభావం కనిపిస్తూ ఉండేది. 1937లోనే తనలోని కాముకుడు, కథకుడు చలం చచ్చిపోతున్నాడని స్వయంగా చెప్పుకున్నాడు. అయితే ఆ తర్వాత సంవత్సరంలో రచించిన ‘అరుణ’లో మాత్రం కాముకుడు చచ్చిపోయిన దాఖలా ఏమీ కనిపించలేదు. అయితే కథకుడిగా చలం అంతకుముందు దాకా చేసిన రచనలకు ఈ ‘అరుణ’ రచనకు మాత్రం స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. అప్పటిదాకా సూటిగా కథ చెప్పి పాఠకుడ్ని ఇట్టే ఆకట్టుకునే చలం ‘అరుణ’లో మాత్రం కొరకరాని కొయ్యలా కనిపిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే అరుణలో కొత్త టెక్నిక్‌ని ప్రవేశపెట్టాడు. నవల ప్రారంభ దృశ్యంనుంచి పాఠకుడికి ఏమీ అర్ధంకాక తికమక పడతాడు. క్రమక్రమంగా వివిధ పాత్రల ప్రవేశంతో కథలో ఆసక్తి మొదలవుతుంది. రచయితగా చలం ఈ నవల్లో ప్రధానపాత్ర పోషిస్తాడు. రచయిత ఇంటినే రంగస్థలిగా మార్చి కథ నడిపిస్తాడు. ఎక్కువగా ప్రతీకాత్మక (సింబాలిక్) ధోరణితో ఈ నవల నడుస్తుంది. పాఠకుడు ఓపిగ్గా మనసు పెట్టనిదే ఈ నవల అర్ధంకాదు. ‘మైదానం’ నవల పంచదార చిలక అయితే ‘అరుణ’ పాషాణ పాకం.
చలం జీవితాంతం ఎదురుచూసిన ఆదర్శస్ర్తి, దివ్యమూర్తిగా ‘అరుణ’ కనిపిస్తుంది. అయితే చలం తనదైన ‘లైంగిక స్వేచ్ఛా’ మార్గం మాత్రం ‘మిస్’ కాకుండా జాగ్రత్తపడ్డాడు. ఒకవైపు అరుణను లోకోత్తర దివ్యస్ర్తిగా చెబుతునే మరోవైపు తాను కోరుకున్న వారితో స్వేచ్ఛగా సంచరించేలా అరుణను చిత్రీకరించాడు. ఒక్కోసారి ‘్భగవాన్’ స్ఫురణకువచ్చేలా ‘అరుణ’ పాత్రకు దివ్యత్వాన్ని కూడా ఆపాదించే ప్రయత్నం చేశాడు.
మునసబు జయరావు భార్య అరుణ. సంపదలకు అధికారానికి లోటులేదు. కానీ భర్తపై అసంతృప్తితో బీస్ట్, నాగన్ అనేవారితో సంబంధం పెట్టుకుంటుంది. మరోవైపు రచయిత (చలం) కూడా అరుణను కోరుకుంటూ ఉంటాడు. ఒక సస్పెన్స్ సినిమాలోని సీన్‌లా అరుణ నవల్ని మొదలుపెడతాడు చలం. రచయిత (చలం) రాత్రిపూట చదువుకుంటూ ఉండగా అతని గదిలోకి ప్రవేశిస్తుంది అరుణ. తలుపు గడియవేసి ఇల్లు భద్రం చేసి వచ్చాను కదా! ఈమె లోపలికి ఎలా వచ్చింది చచ్చిపోయి అంటూ ఉత్సుకతను రేపుతాడు. అయితే తలుపులు మూసి గడియవెయ్యడం మరిచిపోతాడు రచయిత. చలం నమ్మిన స్ర్తి స్వేచ్ఛకు అరుణను ప్రతీకలా చిత్రించే ప్రయత్నం చేశాడు చలం. అరుణను అతీంద్రీయ శక్తిగా, శక్తి స్వరూపిణిగా మలిచాడు.
అరుణతో రచయిత సంభాషణలు పరస్పరం మమేకమయ్యే భావపరంపరతో రాత్రంతా గడిచిపోతుంది. తెల్లారేసరికల్లా అరుణ ప్రియులిద్దరూ రచయిత ఇంటికొస్తారు. అరుణ పొందుకోసం తహతహలాడతారు. అడవి జంతువుల్లా పోట్లాడుకుంటారు. కాట్లాడుకుంటారు. ఎవరికి వారే అరుణను పొందాలనుకుంటారు. కానీ ఆమె మాత్రం ఎవరికీ లొంగదు. వారందర్నీ ప్రేమగానే చూస్తుంది. ఈలోగా భర్త జయరావు అతని తల్లి, పంగనామాల ఆచార్యులు ఆమెను వెదుక్కుంటు అక్కడకి వస్తారు. భర్త రావడంతో ప్రియులిద్దరు పక్కకు జరుగుతారు. ఇల్లు వదిలి వచ్చినందుకు భర్త అరుణను మందలిస్తాడు. తనతో తిరిగి వచ్చేయమంటాడు. విధిలేక అరుణ అంగీకరించి భర్త వెంట బయలుదేరుతుంది. అయితే రైలు తప్పిపోవడంతో వారంతా ఆ రాత్రి తిరిగి రచయిత ఇంటికి వచ్చేస్తారు. తెల్లారేసరికి అరుణ కనిపించదు. మరి ఏమైంది? భర్తతో తిరిగి వెళ్లడం ఇష్టం లేక మరణించిందా? లేక మరేమైంది? అన్న సందిగ్ధతతో కథ ముగిస్తాడు రచయిత. అయితే చివరలో ‘అరుణ’ చచ్చిపోలేదన్న భ్రమ కల్పిస్తాడు. ‘‘నాకు తెలుసు. మబ్బుల్లో చిన్న బిడ్డల లేత మడమల మీద కందిన ప్రియురాలి మెడమీద రోజాపువ్వుల రేకుల్లో, పద్మాల నడుమ, తాగిన మా కళ్ల కొలకుల ఎరుపు జీరల్లో నశించలేదని రచయిత చెబుతాడు. (అరుణ పే-) ఈ నవల రాయడానికి ముందు సంవత్సరం (1937) చలం ఇలా చెప్పుకున్నాడు. ‘‘ఏళ్లనుంచీ పేరుకున్న కిలుము క్రమంగా తోమేస్తున్నారాయన (్భగవాన్ రమణమహర్షి) ఈ పాత హృదయంమీద అక్కడక్కడా వెలుగు రేఖలు పడుతున్నాయి’’. అయితే అరుణ నవల్ని పరిశీలిస్తే చలంలో ఏళ్లనుంచి పేరుకుపోయిన (శృంగార) కిలుముపోయిన దాఖలాలేమీలేవుగానీ అక్కడక్కడ వెలుగురేఖలు (ఆధ్యాత్మిక వాసనలు) మాత్రం కనిపిస్తాయి.
‘తీవ్రమైన వాంఛ నాకళ్లకి పొరలు కప్పకపోవడంచేత, ఆమె (అరుణ) అందాల్ని చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాను. ఈ మాయ ప్రపంచంలో ఇంకా చిక్కని మాయ ఈ ప్రేమ మాయ స్ర్తి వాంఛ! ఆ మోహమే ముక్కుపట్టుకుని తాను వలచింది రంభ చేస్తుందంటాడు చలం (అరుణ పే.9) అందగత్తె ఎదురుగా ఉన్నా మోహం లేకపోవడంతో రాత్రి బాధిస్తుందంటూ రచయిత ఆవేదన చెందడం చూస్తే అప్పటికి చలంలోని ‘వేడి’ కాస్తంత చల్లబడిందనుకోవాలి. ఆమె (అరుణ) నా కళ్లని పెదిమలతో తెరుస్తోంది. ఆమె వేళ్లు వెనె్నముకకి చక్కలిగింతలు పెడుతున్నాయి. ఇంత రసికులు గనకనే ఆమెనుంచి చిరునవ్వు పొందిన పురుష నిర్భాగ్యులందరూ ఊర్వసి దర్శనం పొంది పోగొట్టుకున్నట్టు అన్ని సుఖాలు వదలుకుని ఆమెకోసం వెతుక్కుంటూ తిరుగుతారు’’ అంటూ అరుణని పరిచయం చేస్తాడు రచయిత (అరుణ పే-24)
అంతేకాదు ‘‘అరుణ సహాయ నిరాకరణోద్యమంలో పనిచేసింది. జైలుకు మాత్రం వెళ్లలేదు. తెలివిగా తప్పించుకుంది అంటారు గిట్టని వాళ్లు. అంతేకాక ఇంట్లోంచి తప్పించుకుని స్వేచ్ఛగా తిరగడానికి మంచి వంక దొరికింది అంటుంది పాడులోకం! కానీ అదంతా స్వేచ్ఛా సమరమేకదా! స్వేచ్ఛని వాంఛించిందని తప్పుపట్టడమెందుకు? అని ఆశ్చర్యపడతా’’నంటూ రచయిత మళ్లీ తన సిద్ధాంతానికి వచ్చేస్తాడు. ‘అరుణ’ రచనాకాలం నాటి చలానికి, అంతకు ముందు చలానికి కొంతలో కొంత భేదం కనిపిస్తుంది. ఎదురుగా రంభను తలదనే్న సౌందర్య రాసి ఉన్నా రచయిత (చలం) స్వభావ సిద్ధంగా ఉద్రేక పడడం, అమాంతంగా ఆమెను సొంతంచే సుకోవడం వంటి చేష్టలకు కాస్తంత దూరంగానే ఉంటాడు.
‘‘స్వేచ్ఛ స్వేచ్ఛ అంటాంగానీ, మనల్ని బంధించి నిలబెట్టే ఈ దేశం, సంఘం, కట్టుబాట్లు, మర్యాదలు, ఈ నాచురల్‌లాస్, ఫిజికల్ లాస్, సోషల్ లాస్, మన స్వేచ్ఛా వాదాలు, ప్రణయాలూ-శరీరం సరిగా పనిచేస్తున్నంతసేపే, అసత్యాలు శరీరపునిబంధనలకి యెదురు తిరగడాలు, గంతులూ’’ (అరుణ పే-78) అంటాడు. దీన్నిబట్టి చలంలోని కామం పొంగు తగ్గుముఖం పట్టిందనిపిస్తుంది. చలం ఓ సందర్భంలో అంటాడు ‘కామం నా రక్తంలో పుట్టిందని..’అరుణ’లో కూడా ‘దాని గుణం దాని రక్తంలోనే ఉందిలెద్దూ’ అని అరుణని ఉద్దేశించి ఆమె అత్త అంటుంది. అరుణ పాత్రని తన జీవితానికి, వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా మలుచుకున్నాడు చలం.
‘‘ఆమె పుణ్యరాశి-ఈ లోకంలో మధుర పుష్పాలూ అందాలూ అన్నీ కలిసి’’ అరుణ సృష్టింపబడిందంటాడు చలం. అంతేకాదు అరుణ ఒక్కర్నే ప్రేమించి, వారినే నమ్మి ఉండే మనిషి కాదు. పురుషులు ఆమెకి ఆటవస్తువులు, ఆమె తృప్తికి ఉపకరణాలు’’ అనిపిస్తాడు రచయిత. నిజానికి ఇది చలానికే వర్తిస్తుంది. స్ర్తిలు ఆయనకు ఆటవస్తువులు, ఆయన తృప్తికి ఉపకరణాలు. అరుణ కనబడకుండా పోయాక మళ్లీ ఎప్పటికీ కనిపించలేదు. ప్రతి సంవత్సరము రచయిత, బీస్ట్, నాగన్ ఇంకా నలుగురూ ఆ రోజు సాయంత్రమే కలుసుకుని షాంపెయిన్‌లో అరుణ రసికత్వాన్ని తలుచుకుంటూ రాత్రి గడుపుతారు. రచయిత మాత్రం అరుణ చచ్చిపోలేదు. ఇంకా బతికుందన్న నమ్మకంతో ఉంటాడు.
‘‘జీవితంలో ఈ దేహానికి నా శృంగార భావాలకి ఎట్లా స్వర్గ ద్వారాలు తెరిచిందో, అట్లానే నా ఆత్మకీ, నీ ఆధ్యాత్మిక సందేహాలకీ ఎప్పుడో, ఏ ఆశ్రమంనుంచో, స్వర్గ ద్వారాలు తెరుస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు రచయిత (చలం). అరుణ ఎప్పటికైనా తిరిగి వస్తుంది. అలా వచ్చి ‘‘నువ్వే ఉదయాచలం. నేను అరుణ కిరణాన్ని నిన్ను చుంబిత చలాన్ని చేస్తాను’’ అని అరుణ అంటుందేమోనన్న ఆశ చలానిది. అలా ఆశగా చూస్తున్న చలం జీవితంలోకి ‘లీల‘ ప్రవేశించింది. (1942) చలం ‘అరుణ’లో దర్శించిన స్ర్తి రూపాన్ని లీలలో చూశాడు. తన 48వ ఏట ‘లీల’ ప్రవేశం చలంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
తను ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ఆదర్శస్ర్తి (అరుణలాంటి) ఈ లీలే అంటూ చలం భావిస్తాడు. ఏడేళ్లపాటు లీలతో సహజీవనం చలంలో అనూహ్య మార్పులకు దోహదం చేసింది. ‘లీల’ వదిలి వెళ్లిపోయాక చలం జీవితం ‘శూన్య’మైంది. దాన్ని పూడ్చుకోటానికి చలం అరుణాచలంకు చేరుకుంటాడు..అలా ‘అరుణ’...‘లీల’ రూపంలో చలాన్ని రమణాశ్రమానికి చేరువ చేసింది.

Thursday, June 20, 2013

అగ్నికణం

అగ్నికణం : ఈ నవల తెలంగాణ గ్రామాలలో నెలకొన్న సామాజిక పరిస్థితులకు వాస్తవ చిత్రీకరణ. భూస్వాములు వారి తాబేదార్లు స్త్రీలపై లైంగిక దౌర్జన్యాలు చేయ డం, లొంగని స్త్రీల పట్ల అభియోగాలు మోపి హింసించడం నిత్యకృత్యాలుగా మారి నికృష్టచేష్టలుగానే మిగిలిపోయినవి.

అగ్నికణం నవలలోని ప్రధాన పాత్రలు : బయ్యక్క (బిక్కు), పికిలి నర్సయ్య (బయ్యక్క అన్న), మెగిలయ్య, గౌరయ్య, నర్సయ్య(పెద్ద మనిషి)పాపరాజు, రాజా రాం, కోమటి, కోమటి కొడుకు.
బయ్యక్క పుట్టింది మహారాష్ట్రలో. ఆమె చిన్నతనం పత్తితోటల్ల తండ్రితో పాటు కులాసాగానే సాగింది. తండ్రి మరణంతో తెలంగాణలోని మారుమూల గ్రామం చేరుకున్నది. తల్లి కూలి పనిచేసేది. ఆమె అన్న నర్సయ్య ఎడ్డోడు. ఊరవతల చిన్న గుడిసె, ఆ గుడిసెలో నివాసం. బిక్కుకు యుక్త వయసు వచ్చేసరికి ఆమె లైంగిక దౌర్జన్యాలకు గురైంది. ఆమె శరీరాన్ని ఊళ్లె చాలామంది వాడుకున్నరు. తండ్రి నుంచి కొడుకు వరకు ప్రతి అడ్డమైన వాడూ వాడుకున్నడు. మొండయ్య, గౌరయ్య, పాపరాజు కోమటివాని కొడుకు, కోమటి ఇలా ప్రతివాడు ఆమె పట్ల లైంగికంగానే అనుభవించాలనే ప్రయత్నం తప్ప మరోటి లేదు.
బిక్కుకు పికిలి ఆత్మీయుడు. వాడితో అనేక విషయాలు చెప్పుకునేది. తనను సమాజం పతితగా మార్చిందని ఆవేదనపడేది. ప్రతివాడికి తన శరీరం కావాలి.

తన శరీరంలోని బెత్తెడు జాగ కొరకు మాత్రమే పరితపించారని, దాని కొరకు అనేక బాసలు చేసేవారని చెప్పుకొని దుఃఖపడ్డది. బిక్కు జీవి త ప్రభావం అన్న నర్సనిపై పడింది. వానికి పిల్లనిచ్చేవారే లేరు. వాడు ఎంతగానో కుమిలిపోయి, చివరికి ఎటో ఎళ్లిపోయిండు. వాడి అడ్రస్ లేదు. బిక్కు మారాలనుకున్నది. కానీ సమాజం మారనివ్వలేదు. బిక్కు కనా కష్టం చేసింది. పనికి పోయింది. తట్టమోసింది. రాళ్లెత్తింది. పాడు జీవితం నుంచి మారాలని ప్రయత్నించింది. సమా జం మారనివ్వలేదు. బిక్కుకు ఏకైక దికై్కన తల్లి ముసల్ది మరణించింది. బిక్కు ఒంటరిదైంది. ప్రతి మగవాడు బిక్కును తినెయ్యాలనే చూపులే తప్ప మరోటి కాదు. కోమటి కొడుకు బిక్కును ఆశించాడు. వాని దండ్రి ఆశించాడు. మొండయ్య, గౌరయ్యలు పీక్కుతిన్నారు. పాపరాజు కన్నేసి కోర్కె తీర్చమన్నాడు. బిక్కు కాదంది.

వారు కాలనాగై పడగపూత్తారు.వేధించారు. ఒంటరిని చేశారు. చివరికి తండ్రిలాంటి నర్సయ్యతో అక్రమ సంబంధం అంటగట్టి చితకబాది ఊరునుంచి తరిమేశారు. బిక్కుకు ఆత్మీయమైన ముద్దుబిడ్డ పికిలి దూరమయ్యాడు. బయ్యక్క కడుపుతోనుంది. దానికి తండ్రెవడు? మొండయ్యనే. కానీ వాడొప్పుకోలేదు. కడుపుతోనున్న బిక్కు పట్నం చేరింది. అరిగోస పడ్డది. అక్కడ గవే చూపులు. ఆ బెత్తెడు జాగ కొరకే తపన. మనిషన్న వాడులేని మానవత్వం దహించుకుపోయిన సమాజమిది. గుడిసెలున్న చోటుకు వచ్చింది. రాజారాం అనే విప్లవకారునితో శరణు వేడుకుంది. కాముక సమాజమును అర్థం చేసుకున్న అతడు బిక్కుకు ఆశ్రయం కల్పించాడు. చదువు నేర్పించాడు. సంస్కారం నేర్పించాడు. విప్లవ భావాలను అర్థం చేసుకున్న బికిలి సమాజ స్వరూపాన్ని అర్థం చేసుకున్నది. తనను అవమానించి, తనను నాశనం చేసిన గ్రామాన్ని సంస్కరించే దిశలో ఆలోచించే గొప్ప మార్పును నవల ముగింపులో అల్లం రాజయ్య చూపెట్టా డు.

అగ్గి రాజుకున్నాక అది ఆరిపోదు. జ్వాలవలె రగులుతుంది. దౌర్జన్యం ఉన్నచోట తిరుగుబాటు ఉంటుంది. అదే సంఘ సంస్కరణకు దారి తీస్తుంది. వెలుగు దారి అవుతుంది. అల్లం రాజయ్య నవలల్లో కొలిమంటుకున్నది, ఊరు,అగ్నికణం నవలల్లో అమానవీయ సమాజంలో మార్పును తీసుకురావాలనే ప్రయత్నం కన్పిస్తుం ది. తెలంగాణ పల్లెల్లో రాజుకున్న విప్లవ భావాలు చైతన్య శిఖరాలై దోపిడీ దారులను తరిమేసిన పరిస్థితులు కన్పిస్తాయి. సింగరేణి బొగ్గు గనులు, అనేక ఉద్యమాలు, కార్మికలోకపు ఐకమత్యం మనకు కనిపిస్తాయి. విప్లవ భావం వీరత్వానికి ప్రతీకగా నిల్చిన స్థితుల్ని సామాన్యుని భాషలోనే చిత్రించి సజీవతకు జీవం పోశారు అల్లం రాజయ్య. 



Copyright:డాక్టర్ సందినేని రవీందర్

Monday, April 15, 2013

మహి

http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=6715&Categoryid=1&subcatid=3

చైత్రాగమనంతోనే మహి మొల కలెత్తుతుంది. చిగురుస్తుంది. మొగ్గ తొడుగుతుంది - పూలు పూస్తుంది. ఈ రాగబంధాన్ని రచయిత్రి కుప్పిలి పద్మ రమణీయంగా చిత్రించారు. ‘మహి’ నవల రూపంలో మన చేతికం దించారు. లోగడ ఒక వారపత్రికలో సీరియల్‌గా ప్రచురితమై పాఠకాదరణ పొందిన ఈ నవల, పాశ్చాత్య సంస్కృతికి ప్రభావితమైన మధ్యతరగతి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. జీవన మధురిమను రుచి చూపుతుంది. ఏలె లక్ష్మణ్ ముఖచిత్రం మనోహరంగా వుండి చదువరులను ఆకర్షిస్తుంది.

సరైన తోడు దొరకనప్పుడు ఒక్కోసారి ఒంటరి ప్రయాణమే హాయిగా ఉంటుంది. మహి కూడా అలాగే జీవిస్తుంటుంది. అలజడితో చలించక అంతర్వాహినిలా నిశ్శబ్దంగా సాగిపోతుంది. సమస్తం సమదృష్టితో వీక్షిస్తూ, కుటుంబాన్ని వెలిగించాలని తాపత్రయ పడుతుంది. అయితే ఆమె ప్రయత్నానికి పర్యవసానాన్ని మార్చేశక్తి లేదు. వైదేహి, ప్రకాశరావు దంపతుల ఆరుగురి సంతానంలో ‘మహి’ చివరి అమ్మాయి. హైదరాబాద్‌లో లెక్చరర్‌గా ఉద్యోగం. అక్కడే అక్క మాధవి కుటుంబమూ.

తల్లి తమ దగ్గరికి వస్తూ, పోతూ వుంటుంది. మాధవి ముద్దుల కూతురు నందన. వైదేహికి మరీ గారం. నందన రిచ్‌గా బతకాలని బోలెడు కలలు కంటుంది. బోర్‌లైఫ్ అస్సలు భరించలేదు. అమాంతం ఎగిరి ఆకాశాన్ని అందుకోవాలని ఆరాట పడుతుంది. అరిచి గీపెట్టి మరీ అడిగినవన్నీ సాధించుకుంటుంది. ‘‘పబ్‌కి వెళ్ళు. చక్కగా ఎంజాయ్ చెయ్. అయితే తాగొద్దు. నేను, డాడీ కలిసి తాగేటప్పుడు టేస్ట్ చేద్దువుగాని’’అని కూతురు బాయ్‌ఫ్రెండ్‌తో తిరగడానికి అనుమతిస్తుంది తల్లి మాధవి. ఆ ఇంటి వాతావరణంలో ఇలాంటి ఇంపైన అవగాహన కనిపిస్తుంది.

అక్కడ విశాఖలో మహి పెద్దన్నయ్య రామచంద్రరావు, వదిన విజయది మరో కథ. మృదువైన మాటలతో పెద్ద కొడుకుని అదుపాజ్ఞలలో పెట్టుకున్న తల్లి వైదేహి, కోడలిని ఒంటరిని చేస్తుంది. బతుకుతీపి కరువై నిర్లిప్తంగా సాగిపోతున్న ఆమె జీవితంలోకి ఆకస్మికంగా ఓ అందమైన స్నేహం ప్రవేశిస్తుంది. మహి సహాయంతో ఆ కొత్త స్నేహితుడు రవితో మొదలైన ప్రణయ విహారం, క్రమంగా శారీరక సంబంధంగా బలపడుతుంది. తమ ఇంటి పరువు కాపాడుకోవాలనే ఒకేఒక్క తపనతో విజయను కట్టడి చేయడానికి వైదేహీ ఎన్నో ఎత్తులు వేస్తుంది. ఆఖరుకు ఆ సంకెళ్ళు తెంచుకుని విజయ వెళ్ళిపోతుంది. ఆమె పిల్లలు మహి గూటికి చేరతారు.

మహి స్వేచ్ఛా వర్తన ఆమె కుటుంబ సభ్యులకు కంటగింపు కలిగిస్తుంది. అందుకని ఆమెతో అంత ఆత్మీయంగా మెలగరు. అయితే అవసరం వల్లనో, మరో కారణం చేతనో మాట్లాడక తప్పదు. అలాగని వీరి మధ్య ప్రేమాభిమానాలు లేవనీ చెప్పలేం. వారి ఈ అయిష్టతకు, మహి జీవితంలో కల్లోలానికి సాగర్, సిద్ధార్థ, చైతన్య కారణమౌతారు. ఒక్కొకరితో ఒక్కో రకమైన పరిచయం. ఆఖరుకు అభిప్రా యాలు, అభిరుచులు కలిసిన చైత్రతో జీవితం కొనసాగించుకోవాలని మహి నిర్ణయించుకోవడంతో కథ ముగుస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఇంత విసుగు, కోపం, నిర్లక్ష్యం, నిందలు, చులకన, ఎగతాళి, చీదరింపులు, వంకర నవ్వులు, సూటీమాటలు, ఎత్తిపొడుపులు వినాల్సి రావడం నిజంగా బాధా కరం. ఆ వైనాన్ని చిత్రించడంలో రచయిత్రి కృతకృత్యులయ్యారు.

మనల్ని వెంటాడి వేధించే వాక్యాలు ఈ నవల్లో అడుగడుగునా తారాజువ్వల్లా తారసపడతాయి. అయితే ఇందులో ఇతివృత్తం కొత్తదేమీ కాదు. ఓ కుటుంబం, అందులో సరాగాలూ-విరాగాలూ, అంతే! కాకపోతే విభిన్న వ్యక్తిత్వాల్లోని నిగూఢతను లోతుగా స్పర్శించడం వల్ల వాస్తవిక చిత్రణగా స్ఫురిస్తుంది. కుటుంబంలోని వ్యక్తుల ఆలోచనా ధోరణులకు తార్కికత జోడించి చెప్పడం వలన రచన మెరుపు సంతరించుకుంది. అలాగే భిన్న జీవనశెలులను ప్రజెంట్ చేయడంలో రచయిత్రి నేర్పు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘మహి’లో నేర్పు, కూర్పు కనిపించినంతగా సృజన కానరాక పోవడం ఓ చేదునిజం!
- కోటేశ్వరరావు
(‘మహి’ - కుప్పిలి పద్మ, పేజీలు: 297,
వెల: రూ. 120, ప్రతులకు: 201, విజయలక్ష్మి అపార్ట్‌మెంట్స్, మెథడిస్ట్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్-16)
- See more at: http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=6715&Categoryid=1&subcatid=3#sthash.wT48WMIs.dpuf

అందే నారాయణస్వామి


This article is sponsored by

‘చీకటి తెరలు’ చించినవాడు!





మంచి రచయితలంతా జీవనంలోని వాస్తవికతను చూస్తారు. అవాస్తవికత అంటే నిర్దయగా ఉంటారు. దాదాపు వంద కథలు రాసిన అందే నారాయణస్వామి కూడా అలాంటి కథకుడు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన నారాయణస్వామి వృత్తికి నేతగాడు. దిగువ మధ్య తరగతి, కాస్త పెకైదిగిన తరగతి కుటుంబ జీవనం ఆయన కథలకు ఇతివృత్తాలుగా కనిపిస్తాయి. చిన్న గుమాస్తాలు, అమాయక గృహిణులు, ఉపాధ్యాయులు ఆ కథలలో కనిపిస్తారు. ఈ తరగతి, అందులోని వారి జీవిత వాస్తవాలు ఏవీ నారాయణస్వామి చూపు దాటిపోలేదు. వారి కన్నీళ్లు, వెతలు, అప్పులు అన్నీ ఆయనకు కథా వస్తువులే. ఒక దశ తర్వాత అకాల అంధత్వం కూడా ఆయన సాహిత్యసేవకు అడ్డంకి కాలేకపోయింది.

నారాయణస్వామి మొదట పద్య కవిత్వం వైపు మొగ్గినవారే. కానీ మల్లాది రామకృష్ణశాస్త్రి, శివశంకరశాస్త్రి , ఉన్నవ లక్ష్మీనారాయణ, నార్లతో ఏర్పడిన స్నేహం కథ వైపు నడిపించింది. మంగళగిరి చేనేతకు వన్నెకెక్కింది. చాలా వ్యవస్థల వలెనే చేనేత కూడా ప్రపంచీకరణ దుష్ర్పభావానికి గురయినదే. వారి జీవితాలను ఛిద్రం చేసినదే. ఈ పరిణామాలను కూడా నారాయణస్వామి తన కథలకు ఇతివృత్తంగా తీసుకున్నారు.

ధనికులూ, రుణగ్రస్థుల బంధం ఎలాంటిదో ‘ప్రతిఫలం’ అన్న కథలో అందే చిత్రించారు. రుణగ్రస్థులు తమ ఆస్తులు, ఇళ్లు ఎలా కోల్పోతారో ఇందులో వర్ణించారాయన. ‘పుత్ర సంతానం’ మన కుటుంబాలలోని ఇంకొక కోణాన్ని చూపుతుంది. డబ్బులో పుట్టి, అందులోనే పెరిగిన పిల్లలు ఆఖరికి రక్త సంబంధీకుల పట్ల కూడా ఎలా ఉండగలరో, వారసత్వ విషయంలో, స్త్రీపురుష సంబంధాల దగ్గర వారు ఎలా వ్యవ హరిస్తారో ఈ కథలోనే చెప్పారు.

ఏ రచయిత అయినా తను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని రచనలలో చిత్రించకుండా ఉండలేడు. నారాయణస్వామి మంగళగిరి పానకాలస్వామి గురించి, ఆ పరిసరాలను గురించి కథల్లో తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. అలాగే గుంటూరు ప్రాంతంలో వినిపించే మాండలికాలు కూడా. ‘పరివర్తనం’ అన్న కథలో దళిత సమస్యను చర్చించారు నారాయణస్వామి. ‘మాలపల్లి’ నవలాకర్త ఉన్నవ సాహచర్యం, ప్రభావం ఈ కథా రచనలో సుస్పష్టం. ఆధునికత మీద అభిమానం ఉన్నా, అది వెర్రిపోకడలకు పోరాదని చెప్పే కథ ‘సంఘ సంస్కరణ’.

అందే రాసిన విశిష్టమైన కథ ‘ఉపాసనాబలం’. పెద్దగా చదువు లేకపోయినా చక్కని మాటకారితనంతో ప్రజలందరినీ కట్టడి చేసే వ్యక్తి జయరామయ్య. ఇందులో ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడు ప్రయత్నిస్తాడు. ఈ కథను నడిపించే క్రమంలోనే రచయిత పల్లెల్లో ఉండే అనేక ప్రత్యేకతలను గురించి వివరిస్తాడు. అనేక సంఘటనల సమాహారం ఈ కథ. 1956 ప్రాంతంలోనే తన ప్రతాపం చూపించిన యంత్రీకరణతో చేనేత పనివారి బతుకుల్లో అలుముకున్న చీకటిని చిత్రించిన కథ ‘శిల్పి’. నేతగాడు బతికేందుకు వీథి చివర మధూకర వృత్తిని ఎంచుకోవడం ఇందులో ఇతివృత్తం. అలాగే ‘కొడుకులు’ కథ రైతు జీవితంలోని చేదును వర్ణిస్తుంది. కొడుకులను నమ్ముకోవడం

కంటె నేలతల్లిని నమ్ముకోవడమే మేలని ఈ కథలో రచయిత చెబుతాడు.
నారాయణస్వామి నాలుగు కథా సంపుటాలను వెలువరించారు. రెండు నవలలు కూడా రాశారు. జీవితంలోని వాస్తవికతతో పాటు, దాని మీద మనిషికి ఉండే మమకారం గురించి సానుకూల దృక్పథంతో అర్థం చేసుకోవడానికి అందే కథలు ఉపకరిస్తాయి. విశాలాంధ్ర సంస్థ 2008లో ఈ రచయిత 16 కథలను ‘చీకటితెరలు’ పేరుతో వెలువరించింది. ఇది మార్కెట్‌లో దొరుకుతుంది- కొని, చదవండి!
- వేలూరి కౌండిన్య
- See more at: http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=34878&Categoryid=1&subcatid=3#sthash.wOrcIXcv.dpuf