This article is sponsored by
‘చీకటి తెరలు’ చించినవాడు!
![]() నారాయణస్వామి మొదట పద్య కవిత్వం వైపు మొగ్గినవారే. కానీ మల్లాది రామకృష్ణశాస్త్రి, శివశంకరశాస్త్రి , ఉన్నవ లక్ష్మీనారాయణ, నార్లతో ఏర్పడిన స్నేహం కథ వైపు నడిపించింది. మంగళగిరి చేనేతకు వన్నెకెక్కింది. చాలా వ్యవస్థల వలెనే చేనేత కూడా ప్రపంచీకరణ దుష్ర్పభావానికి గురయినదే. వారి జీవితాలను ఛిద్రం చేసినదే. ఈ పరిణామాలను కూడా నారాయణస్వామి తన కథలకు ఇతివృత్తంగా తీసుకున్నారు. ధనికులూ, రుణగ్రస్థుల బంధం ఎలాంటిదో ‘ప్రతిఫలం’ అన్న కథలో అందే చిత్రించారు. రుణగ్రస్థులు తమ ఆస్తులు, ఇళ్లు ఎలా కోల్పోతారో ఇందులో వర్ణించారాయన. ‘పుత్ర సంతానం’ మన కుటుంబాలలోని ఇంకొక కోణాన్ని చూపుతుంది. డబ్బులో పుట్టి, అందులోనే పెరిగిన పిల్లలు ఆఖరికి రక్త సంబంధీకుల పట్ల కూడా ఎలా ఉండగలరో, వారసత్వ విషయంలో, స్త్రీపురుష సంబంధాల దగ్గర వారు ఎలా వ్యవ హరిస్తారో ఈ కథలోనే చెప్పారు. ఏ రచయిత అయినా తను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని రచనలలో చిత్రించకుండా ఉండలేడు. నారాయణస్వామి మంగళగిరి పానకాలస్వామి గురించి, ఆ పరిసరాలను గురించి కథల్లో తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. అలాగే గుంటూరు ప్రాంతంలో వినిపించే మాండలికాలు కూడా. ‘పరివర్తనం’ అన్న కథలో దళిత సమస్యను చర్చించారు నారాయణస్వామి. ‘మాలపల్లి’ నవలాకర్త ఉన్నవ సాహచర్యం, ప్రభావం ఈ కథా రచనలో సుస్పష్టం. ఆధునికత మీద అభిమానం ఉన్నా, అది వెర్రిపోకడలకు పోరాదని చెప్పే కథ ‘సంఘ సంస్కరణ’. అందే రాసిన విశిష్టమైన కథ ‘ఉపాసనాబలం’. పెద్దగా చదువు లేకపోయినా చక్కని మాటకారితనంతో ప్రజలందరినీ కట్టడి చేసే వ్యక్తి జయరామయ్య. ఇందులో ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడు ప్రయత్నిస్తాడు. ఈ కథను నడిపించే క్రమంలోనే రచయిత పల్లెల్లో ఉండే అనేక ప్రత్యేకతలను గురించి వివరిస్తాడు. అనేక సంఘటనల సమాహారం ఈ కథ. 1956 ప్రాంతంలోనే తన ప్రతాపం చూపించిన యంత్రీకరణతో చేనేత పనివారి బతుకుల్లో అలుముకున్న చీకటిని చిత్రించిన కథ ‘శిల్పి’. నేతగాడు బతికేందుకు వీథి చివర మధూకర వృత్తిని ఎంచుకోవడం ఇందులో ఇతివృత్తం. అలాగే ‘కొడుకులు’ కథ రైతు జీవితంలోని చేదును వర్ణిస్తుంది. కొడుకులను నమ్ముకోవడం కంటె నేలతల్లిని నమ్ముకోవడమే మేలని ఈ కథలో రచయిత చెబుతాడు. నారాయణస్వామి నాలుగు కథా సంపుటాలను వెలువరించారు. రెండు నవలలు కూడా రాశారు. జీవితంలోని వాస్తవికతతో పాటు, దాని మీద మనిషికి ఉండే మమకారం గురించి సానుకూల దృక్పథంతో అర్థం చేసుకోవడానికి అందే కథలు ఉపకరిస్తాయి. విశాలాంధ్ర సంస్థ 2008లో ఈ రచయిత 16 కథలను ‘చీకటితెరలు’ పేరుతో వెలువరించింది. ఇది మార్కెట్లో దొరుకుతుంది- కొని, చదవండి! - వేలూరి కౌండిన్య |
0 comments:
Post a Comment